KTR Tweet on Electricity Day celebrations in Telangana : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి.. దేశానికి టార్చ్ బేరర్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ విద్యుత్ విజయోత్సవాల్లో భాగంగా "తెలంగాణ విద్యుత్ ప్రగతి - నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానం" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014 కు పూర్వం నిత్యకృత్యాలు అని కేటీఆర్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతోందని తెలిపారు.
KTR Tweet on Electricity Day :నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. స్వతంత్ర భారత దేశంలో విద్యుత్తు రంగంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
పెరిగిన విద్యుత్ సామర్థ్యం :రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమేనని... కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా విద్యుత్ సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగిందని కేటీఆర్ వివరించారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చారు. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగిందన్న కేటీఆర్... ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లుగా ఉందని వెల్లడించారు.