KTR Tweet On Singareni Coal Mines: తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం జాబితా నుంచి తొలగించి.. ఆ గనులను సింగరేణి కాలరీస్ సంస్థకు నేరుగా కేటాయించాలని మంత్రి కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన మూడు లిగ్నైట్ గనులను వేలం నుంచి తొలగించిన నేపథ్యంలో ట్విటర్ ద్వారా ఆయన స్పందించారు. సింగరేణి కాలరీస్ కోసం తాము కూడా ఇదే డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేశామన్నారు. ఒకే దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అదే విధంగా ఆ నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా.. సింగరేణి కాలరీస్‌కే కేటాయించాలని కేటీఆర్ అన్నారు. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి తొలగించినట్లు ఓ ఆంగ్ర పత్రిక రాసిన వార్తను.. ట్వీట్‌కు జత చేశారు. దేశంలోని తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి.. కేంద్ర ప్రభుత్వం గత నెల 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే ఈ వేలంలో టెండర్లు దాఖలు చేసుకోవచ్చని.. ఈ విధంగా బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని అందులో స్పష్టం చేసింది.