Minister KTR Tweet On Telangana Income: అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతోందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని పునరుద్ఘాటించారు. గత 8 ఏళ్లలో తలసరి ఆదాయం 155 శాతం పెరిగిందని ట్విటర్లో పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1.24లక్షల తలసరి ఆదాయం కాగా.. 2022-23లో రూ.3.17లక్షలకు చేరుకుందని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకున్నా తెలంగాణ నిరంతర వృద్ధి సాధిస్తోందని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో తలసరి ఆదాయం: 'కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం.. ఎన్నో సవాళ్లతో పురుడు పోసుకున్న రాష్ట్రం.. నూతన ఉత్తేజంతో తన దిశను మార్చుకుని ముందుకు సాగిపోయింది. అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ తన ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. దేశంలోని ఏ రాష్ట్రానికి సాధ్యం కాని ఘనతలను సాధించింది. కొన్ని రంగాల్లో ప్రథమ స్థానం సంపాదించింది. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. అద్వితీయమైన పురోగతిని సాధించింది. రాష్ట్రంలో 2014లో రూ.5.05 లక్షల కోట్లున్న జీఎస్‌డీపీ 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుందని, రూ.1.24 లక్షలున్న తలసరి ఆదాయం 2022-2023 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగింది.' అని కేటీఆర్ తెలిపారు.
తలసరి ఆదాయంలో ఏ రాష్ట్రాలు ఎక్కడ: తలసరి ఆదాయం (పర్ క్యాపిటా)లో రూ.6,69,102లతో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాజధాని నగరంలో ఎక్కువ ప్రాంతం ఈ జిల్లాలోనే విస్తరించి ఉండటంతోపాటు ఐటీ, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాలు వృద్ధి చెందడంతో ఇక్కడ తలసరి ఆదాయం భారీగా నమోదైంది. హైదరాబాద్ జిల్లా (రూ.3,49,061), సంగారెడ్డి (రూ.2,49,091), సిద్దిపేట జిల్లా (రూ.2,12,788) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హనుమకొండ జిల్లా రూ.1,30,821 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. ఆపై స్థానాల్లో కుమురం భీం ఆసిఫాబాద్ (రూ.1,31,843), వికారాబాద్ (రూ.1,31,962) జిల్లాలు ఉన్నాయి.