KTR Tweet On Karnataka CM Siddaramaiah : కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్ అయితే తెలంగాణలో బీఆర్ఎస్ది 24 గంటల పవర్ఫుల్ మోడల్ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన కేసీఆర్ ప్రభుత్వానిదని.. అధికారం చేపట్టి 6 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్ణాటకదని విమర్శించారు.
KTR Fires On Karnataka CM Siddaramaiah: ఎన్నికల్లో ఇచ్చిన.. ఐదు హామీలకు పాతరేసి.. నమ్మి ఓటేసిన ప్రజల్ని గాలికొదిలేసి.. తెలంగాణకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదని.. తెలివైన తెలంగాణ అని కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరని కేటీఆర్ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే.. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని ధ్వజమెత్తారు. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నమ్మి మోసం చేసినందుకు వారికి సరైన గుణపాఠం చెప్పడం తథ్యమని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
CM Siddaramaiah Speech at Kamareddy : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కామారెడ్డిలో జరిగిన సభలో పాల్గొని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అనంతరం కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిభారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. రేవంత్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని జోస్యం చెప్పారు.