KTR Tweet on Investigation Agencies : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హీటెక్కుతోంది. ముఖ్యంగా పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల నేతలు పాదయాత్రలు, సభలు అంటూ ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా విమర్శించడం కంటే.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రజల్లోకి ఎక్కువగా చేరుతున్నారు. ఈ విషయం గమనించిన నేతలు సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని పరస్పర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ విమర్శలకు ముఖ్యంగా ట్విటర్ వేదిక అయింది. నేటి రాజకీయ నేతలంతా ట్విటర్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ట్వీట్ చేస్తుంటారు.
KTR Tweet Today : ఇక రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తరచూ కేంద్రంపై, ప్రతిపక్షాలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా కేటీఆర్ మోదీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఈడీ, సీబీఐ విచారణ సంస్థలను కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటోందో ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయో అందరూ గమనిస్తున్నారని ట్వీట్ చేశారు.