KTR Tweet on Gold Icon Award 2022: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో.. తెలంగాణ ఎప్పుడు ముందంజలో ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు డిజిటల్ ఇండియా అవార్డుల్లో గోల్డ్ ఐకాన్ అవార్డు గెలుచుకున్న.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. 2022 డిజిటల్ ఇండియా అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా.. డిజిటల్ ఇనిషియేటివ్స్ విభాగంలో.. స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ సాయిల్ ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది.
ఈ అవార్డును దిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అందుకున్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేథా, క్లౌడ్ టెక్నాలజీల స్వీకరణలో.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ కీలకపాత్ర పోషిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
రెండు రోజుల క్రితమే స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. తొలి 3 స్థానాల్లో రాష్ట్రానికి చెందిన జిల్లాలే నిలిచాయి. 2022 డిసెంబర్‌కు సంబంధించి ఈ అవార్డులు వచ్చాయి. నాలుగు స్టార్ల రేటింగ్‌లో మొదటి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, రెండో స్థానంలో కరీంనగర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లాకు అవార్డులు వచ్చాయి.