తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో కేటీఆర్​ అభివృద్ధి కార్యక్రమాలు​ - భాగ్యనగరంలో కేటీఆర్​ అభివృద్ధి కార్యక్రమాలు​

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్ ఇవాళ ​ హైదరాబాద్​లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కూకట్‌పల్లి నియోజవర్గంలో రూ.101.69  కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు పడగ గదుల ఇళ్లు, ఫిష్‌ మార్కెట్‌, ఇండోర్‌ స్టేడియంను ప్రారంభించారు. కైత్లాపూర్​ వద్ద రూ. 83 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న  రైల్వే పై వంతెనకు కేటీఆర్​ శంఖుస్థాపన చేశారు.

కేటీఆర్​

By

Published : Nov 15, 2019, 12:07 AM IST

భాగ్యనగరంలో కేటీఆర్​ అభివృద్ధి కార్యక్రమాలు​

హైదరాబాద్​ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మంత్రి కేటిఆర్‌ ప్రారంభించారు. చిత్తారమ్మ బస్తీలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. రూ.9.34 కోట్ల వ్యయంతో నిర్మించిన 108 ఇళ్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. సెల్లార్‌, స్టిల్ట్‌తో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అన్ని వసతులతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు అందుబాటులోకి రావడం వల్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌, మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ లబ్ధిదారులతో కలిసి పాలు పొంగించి సామూహిక గృహప్రవేశం చేయించారు.

రూ.5.65 కోట్లతో ఇండోర్​ స్టేడియం

క్రీడా సౌకర్యాల కోసం మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 86 లక్షల వ్యయంతో అయ్యప్ప సొసైటీ.. గాయత్రినగర్​లో నిర్మించిన షటిల్‌ ఇండోర్‌ స్టేడియం, కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌ 5.65 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నిర్మించిన ఇండోర్‌ స్టేడియంను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈత కొలను, బ్యాడ్మింటన్‌ కోర్టు, కరాటే తదితర క్రీడలు ఆడేందుకు సౌకర్యం కల్పించారు.

81 స్టాళ్లతో చేపల మార్కెట్​

మత్స్యకారుల ఉపాధి పెంపొందించేందుకు రూ.2.78 కోట్ల వ్యయంతో అత్యాధునిక చేపల మార్కెట్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. 1,651 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మార్కెట్‌కు జాతీయ మత్య్స అభివృద్ధి సంస్థ 2.25 కోట్లు అందించగా.. జీహెచ్‌ఎంసీ వాటాగా 53.20 లక్షలను కేటాయించింది. మొత్తం 81 స్టాళ్లు మార్కెట్‌లో ఉన్నాయి. రెండు హోల్‌సేల్‌ స్టాళ్లతో పాటు ఫుడ్‌ కోర్టును ప్రత్యేకంగా నిర్మించారు. మత్స్యకారుల వ్యాపారాభివృద్ధికి ఈ మార్కెట్‌ ప్రధాన కేంద్రంగా నిలవనుంది.

పైవంతెన నిర్మాణాలకు శంఖుస్థాపన

రూ. 83 కోట్ల ఖర్చుతో కైత్లాపూర్‌ వద్ద నిర్మించనున్న రైల్వే పై వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. 676 మీటర్ల పొడవు, 16.61 మీటర్ల వెడల్పుతో పై వంతెన నిర్మితం కానుంది. దీని వల్ల జేఎన్టీయూ కూడలి, మలేషియా టౌన్‌షిప్‌, హైటెక్‌ సిటీ పై వంతెన, సైబర్‌ టవర్స్‌ కూడలి, మాదాపూర్‌, బాలనగర్‌, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల వాసులకు సులభంగా తమ గమ్యస్థానాలు చేరుకునే అవకాశం కలుగనుంది. అభివృద్ధి పనుల ప్రారంభంతో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details