భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు సరళంగా, నిర్ధేశిత గడువులోగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీ-పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం. నేడు మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. కొంతకాలంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన టీఎస్ బీ-పాస్ వెబ్‌సైట్ పూర్తి ఫలితాలు ఇచ్చింది. ఇకపై పోర్టల్ ద్వారానే భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తు చేయవచ్చు.
కేవలం రూపాయి చెల్లించి
టీఎస్ బీ-పాస్ కింద 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనానికి ఎలాంటి అనుమతీ అవసరం ఉండదు. కేవలం రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. 600 గజాల లోపు, 10 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే నివాస గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి లభించనుంది. 600 చదరపు గజాల స్థల విస్తీర్ణం కంటే ఎక్కువ, పదిమీటర్ల కంటే ఎత్తైన ఇతర నివాసేతర భవనాలకు 21 రోజుల్లో నిర్మాణ అనుమతులు ఇవ్వనున్నారు. వైబ్‌సైట్, మీసేవ, పురపాలికాల్లోని పౌరసేవా కేంద్రాలు, ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చే యాప్ ద్వారా టీఎస్‌బీపాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో వైబ్‌సైట్ అందుబాటులోకి రానుంది.