వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రీజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా పేరుతో జరిగిన సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా అపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు టెక్నాలజీ ఉపయుక్తంగా ఉందన్నారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎమర్జింగ్ టెక్నాలజీ పాత్ర అనే అంశంపై మంత్రి వర్చువల్ సమావేశం ద్వారా ప్రసంగించారు.
నూతన సాంకేతిక పరిష్కారాలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చోట్ల టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని.. వైరస్ వల్ల ఏర్పడిన పరిమితులను అధికమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు ఎంతగానో దోహదం చేశాయని మంత్రి వివరించారు. వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానికంగా జిల్లా అధికారులు, గ్రామ పంచాయతీలతో సంభాషించేందుకు టెక్నాలజీ ఉపయోగించుకున్నామని తెలిపారు.
ప్రజల కదలికల నియంత్రణల కోసం డ్రోన్లు
లాక్డౌన్ కొనసాగినప్పుడు ప్రజల కదలికల నియంత్రణల కోసం డ్రోన్లు ఉపయోగించామని మంత్రి తెలిపారు. ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను, వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందని వివరించారు. ప్రజలకు రేషన్ సరుకులు అందించేందుకు అవసరం అయిన చోట్ల సాంకేతికతను ప్రభుత్వం ఉపయోగించిందన్నారు.
కేటీఆర్ ధన్యవాదాలు
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మమద్ షాహరియర్ ఆలమ్, మాల్డీవ్స్ అర్థికాభివృద్ధి శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, సింగపూర్ ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్, వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ అధ్యక్షులు బోర్జే బ్రెండెలతోపాటు పలువురు కీలక నేతలు, వివిధ దేశాల మేధావులు, నిఫుణులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఇంత కీలకమైన సమావేశంలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన వరల్డ్ ఎకానామిక్ ఫోరానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవీచూడండి:మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు