తెలంగాణ

telangana

ETV Bharat / state

'పచ్చని మాగాణిగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు' - అసెంబ్లీలో తెలంగాణ చేనేత రంగంపై కేటీఆర్ ప్రసంగం

KTR Speech in TS Budget Sessions 2023-24 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చర్చకు సమాధానమిచ్చారు. శాసనసభలో పురపాలక చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం.. చేనేత రంగం గురించి మాట్లాడారు. చేనేతకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు దక్కాయని తెలిపారు. మరోవైపు ఏ దేశంలోనూ జర్నలిస్టులకు తెలంగాణ తరహాలో రూ.100 కోట్ల నిధి లేదని చెప్పారు. అనంతరం గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో శాసనసభలో రాష్ట్ర ప్రగతిని వివరించారు.

KTR speech
KTR speech

By

Published : Feb 10, 2023, 5:28 PM IST

KTR Speech in TS Budget Sessions 2023-24 : పచ్చని మాగాణిగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రజలను కోరారు. బడ్జెట్‌లోని 6 డిమాండ్లపై చర్చకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులు కూల్చేస్తాం అంటుంటే.. బీఆర్ఎస్ సర్కార్‌ నిర్మిస్తోందని తెలిపారు.

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పురపాలక చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పద్దులపై చర్చకు సమాధానం ఇచ్చారు. చేనేత గురించి మాట్లాడుతూ.. చేనేతకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు దక్కాయని తెలిపారు. రాష్ట్రం చేనేత రంగాన్ని ఆదుకుంటుంటే.. కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై ప్రధాని మోదీ 5 శాతం పన్ను విధించారని.. దాన్ని 12 శాతానికి పెంచాలని చూస్తున్నారని అన్నారు.

KTR comments on Telangana Handloom sector : చేనేతకు సంబంధించిన అనేక బోర్డులను కేంద్రం రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఆల్‌ ఇండియా పవర్‌లూమ్‌ బోర్డు, ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డును రద్దు చేసిన కేంద్రం నుంచి నేతన్నకు శుష్క వాగ్దానాలు, రిక్త హస్తాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు కేంద్రం అన్యాయం చేస్తోందని వాపోయారు.

'సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయమని కేంద్రాన్ని అడిగాం. జమ్మికుంట, కమలాపూర్‌కు హ్యండ్‌లూమ్‌ క్లస్టర్‌ ఇవ్వాలని కోరాం. నేతన్నకు చేయూత అనే మంచి కార్యక్రమం తీసుకొచ్చాం. 26 వేల నేతన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాం. నేతన్నకు బీమా తీసుకొచ్చి రూ.5 లక్షలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్‌.' - కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జర్నలిస్టులకు 16 వేల అక్రెడిటెడ్ కార్డులు లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌లోనూ జర్నలిస్టులకు 3 వేల అక్రెడిటెడ్ కార్డులే ఉన్నాయని తెలిపారు. ఏ దేశంలోనూ జర్నలిస్టులకు తెలంగాణ తరహాలో రూ.100 కోట్ల నిధి లేదని చెప్పారు. కరోనా సమయంలో పాత్రికేయులు ప్రశంసనీయ పాత్ర పోషించారని కొనియాడారు. మీడియా అకాడమీ భవనం పూర్తయిందని.. త్వరలో ప్రారంభించుకుంటామని వెల్లడించారు.

KTR comments on Telangana IT Sector : గూగుల్‌ మ్యాప్‌ల సాయంతో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రగతిని వివరించారు. కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల చిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని తెలిపారు. 2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 8.70 లక్షల ఐటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.

'గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 4.50 లక్షల ఉద్యోగాల్లో మన వాటా లక్షన్నర ఉద్యోగాలు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటింది. సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్‌ పరిశ్రమ నెలకొంది.' అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details