KTR Speech at Zaheerabad Lok Sabha Preparatory Meeting : శాసనసభ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏం కాదని, మూడింట ఒక వంతు సీట్లు గెలిచినట్లేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు జహీరాబాద్ లోక్‌సభ నేతలు పాల్గొన్నారు. అనంతరం వారికి మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు తమను దీవించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జుక్కల్‌లో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని చెప్పారు. కేవలం 1,100 ఓట్లతో షిండే ఓడిపోయారని, నాటి విషయాలను గుర్తు చేశారు. నారాయణ్‌ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్(Congress) నేత జుక్కల్‌లో గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని పేర్కొన్నారు. దళిత బంధు(Dalit Bandhu) పథకాన్ని నిజాంసాగర్ మండలంలో 100 శాతం ఇచ్చినా, మిగతా వర్గాలు తమకు ఓట్లు వేయలేదని ఆవేదన చెందారు.
బంధు పథకాల ప్రభావం : ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఈ బంధు పథకాల ప్రభావం తమపై పడిందని వ్యాఖ్యానించారు. కొత్త ఒక వింతలా, పాత ఒక రోతలా ప్రజలు భావించారన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు.
'తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయి. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. ఈ మూడు ముక్కలాటలో బీఆర్ఎస్కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని' కేటీఆర్ అన్నారు.