KTR Speech at Assembly Monsoon Sessions 2023 : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజూ కొనసాగాయి. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో చర్చ జరిగింది. వాటిపై జరిగిన స్వల్పకాలిక చర్చకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ, ఖర్చుల లెక్క మాత్రమేనని.. అదే బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజల జీవనరేఖ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక వసతులపై బడ్జెట్‌లో 26 శాతం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
KTR on Telangana Development : తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి అని.. తాను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో తమను ఓడించండని మంత్రి కేటీఆర్‌ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సంక్షేమం తప్ప.. సంక్షోభం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కట్టు కథలకు విషపుత్రికలు అని శ్రీశ్రీ అన్నారన్నారు.
'తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత అని చెప్పక తప్పదు. తెలంగాణలోని ఏ పల్లెలో, పట్టణంలో చూసినా సంక్షేమం.. సంతోషమున్నది తప్ప సంక్షోభం లేదు. కాంగ్రెస్‌లో మాత్రమే సంక్షోభం ఉంది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయి. ములుగు జిల్లా ఉత్తమ జిల్లా పరిషత్ అని కేంద్రమే ప్రకటించింది. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ.6 వేల కోట్లు మాత్రమే. గత 9 ఏళ్లలో ఈ ప్రభుత్వం రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్ హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదు. కాంగ్రెస్ 60 ఏళ్లల్లో చేయని పనులను 6 ఏళ్లల్లోనే చేసి చూపించాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
భట్టి ఉంటున్న ఇంట్లో మీటరు చెడిపోయింది :నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామన్న భట్టి వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఉంటున్న ఇంట్లో మంచి నీటి మీటర్ చెడిపోయిందన్న కేటీఆర్.. అందువల్లే రూ.2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. 2022 జనవరి నుంచిభట్టి విక్రమార్క ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదని పేర్కొన్నారు. మీటర్ పని చేసి ఉంటే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదన్నారు. భట్టి కేవలం బుకాయించారన్నారు. నగరంలో ప్రతి ఒక్కరికీ 20 వేల లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
'రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశాం. ఒక్క డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానం. రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం చేయనున్నాం. పదేళ్లల్లో పురపాలకశాఖ ఆధ్వర్యంలో రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం చేసిందేమీ లేదు.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి