Minister KTR Fires on Modi Comments on Telangana Formation : తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మోదీ పాలనలో ఒక్క విషయమైనా లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. అక్కడ చెప్పేందుకు ఏమీ లేకనే పదే పదే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మూటలు ఎలాగూ ఇవ్వరు.. కనీసం మర్యాదైనా చూపండని ప్రత్యేక పార్లమెంటు సమావేశాల(Parliament Special Sessions) సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం(Modi Speech)పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్(Twitter) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"తెలంగాణ మీద.. ప్రధాని మోదీకి పదే పదే అక్కసు ఎందుకు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఎందుకీ వివక్ష? తెలంగాణ అంటేనే గిట్టనట్లు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? పదే పదే తల్లిని చంపి బిడ్డను తీశారని మోదీ అంటున్నారు. అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మీ పాలనలో ఒక్క విషయమైనా లేదు. అందుకే పదేపదే విషం చిమ్ముతున్నారని" ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
Minister KTR Tweet on PM Modi :తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించటం ఇదే తొలిసారి కాదని.. చారిత్రక వాస్తవాల పట్ల మోదీ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని చెప్పడం.. అవాస్తవమన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో తెలంగాణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, భావోద్వేగాలను మోదీ పరిగణించాలని హితబోధ చేశారు.
"వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని.. మా రైతులని కించపర్చింది మీ కేంద్రమంత్రి కాదా. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు. కోటి ఆశలు, ఆకాంక్షలతో పురుడుపోసుకున్న కొత్త రాష్ట్రానికి సహకరించకపోగా.. ఆది నుంచి కక్షను పెంచుకొని.. వివక్షనే చూపిస్తున్నారు కదా. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్ చెప్పినా నీతి లేకుండా మిషన్ కాకతీయ, భగీరథ నిధులు ఆపేశారు. కృష్ణా నీటి వాటాలు తేల్చకుండా పదేళ్లు దగా చేశారు. కాజీపేట ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. దశాబ్దాల కలను నాశనం చేశారు. 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటీ ఇవ్వలేదు."-కేటీఆర్ ట్వీట్