తెలంగాణ

telangana

By

Published : May 13, 2022, 4:20 PM IST

Updated : May 13, 2022, 4:51 PM IST

ETV Bharat / state

'2023 మార్చి నాటికి ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌'

Minister KTR on Pattana Pragathi: రాష్ట్రంలో 2023 మార్చి చివరి కల్లా ప్రతి పట్టణానికి మాస్టర్‌ప్లాన్‌ ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. పురపాలికల అభివృద్ధిపై మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లతో మంత్రి హైదరాబాద్​లో మంత్రి వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ ఏడాది చివరికల్లా కచ్చితంగా చేయాల్సిన 10 పనులను నిర్దేశించారు.

awareness program on pattana pragtathi
పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్​

Minister KTR on Pattana Pragathi: వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై హైదరాబాద్​ వెంగళరావునగర్‌లో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, అధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పపై దృష్టిసారించాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రక్రియ పూర్తికావాలని మంత్రి ఆదేశించారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా పట్టణీకరణ జరుగుతుందని.. అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. పట్టణీకరణ నడుస్తున్న చరిత్ర అని.. ఎవరు ఆపినా అది ఆగదన్నారు. ఈనెల 20 నుంచి జూన్‌ 5 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్‌ నిర్దేశించారు.

పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేస్తున్న మంత్రి కేటీఆర్

రానున్న ఏడేళ్లలో ఊహించని విధంగా పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అందుకు పట్టణాలను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సరిపడా సిబ్బంది లేకపోయినా కష్టపడుతున్న ఉద్యోగులను అభినందించాలని అధికారులకు సూచించారు. పురపాలికల మాస్టర్‌ ప్లాన్‌ సహా ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాల్సిన పనులను వివరించారు. కరీంనగర్‌లో మేయర్‌ ప్రవేశపెట్టిన ప్రగతినివేదికను కేటీఆర్‌ ప్రశంసించారు. ప్రతి మున్సిపాలనిటీలో అది అమలుచేయాలని నిర్దేశించారు.

'సూర్యాపేటలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ గొప్పగా రాబోతోంది. ఒక్క ఇంటిని కూడా వదలకుండా వందశాతం ఇళ్లకు నల్లా నీరు ఇవ్వాలి. బయో మైనింగ్ కూడా అన్ని పట్టణాల్లో చేయాలి. హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి. లంచం లేకుండా భవన నిర్మాణానికి అనుమతి ఇస్తున్నామని చెప్పుకోవాలి. టీఎస్ బీపాస్ గురించి చెబితే గోవా సీఎం ఆశ్చర్యపోయారు. టీఎస్ బీపాస్‌ను ఎవరు అతిక్రమించినా, దుర్వినియోగం చేసినా చర్యలు. పట్టణాల్లో 10 పాయింట్ల కార్యక్రమం వచ్చే ఏడాది లోపు పూర్తి చేయాలి.' -కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్‌ను నియమించి కమిషనర్లు, ఛైర్మన్లపై భారం తగ్గిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశానికి ప్రధాన ఆర్థిక చోదక శక్తులు పట్టణాలేనని... రాష్ట్రానికి 45- 50 శాతం జీఎస్డీపీ హైదరాబాద్ నుంచే వస్తోందని కేటీఆర్​ అన్నారు. 3,618 పట్టణ ప్రాంత వార్డులకు వార్డు ఆఫీసర్లను నియమిస్తామని కేటీఆర్​ అన్నారు. 50వేల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసర్‌, 50 వేలపైగా జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో అన్ని వార్డులకు ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక మెకనైజ్డ్ ధోబీ ఘాట్ ఉండాలని.. అన్ని పట్టణాల్లో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ ఛైర్మన్లు, కమిషనర్లు.. ఇతర అధికారులపై జులుం ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ప్రచారం కోసం ఇష్టారీతిన అధికారులపై వ్యాఖ్యలు చేయడం తగదని వారించారు. కౌన్సిల్ సమావేశాల్లో అధికారులపై అరవడం గొప్ప అని కొందరు అనుకుంటారన్న ఆయన... అధికారులను అవమానిస్తే మనల్ని, మన ప్రభుత్వాలను మనం అవమానించుకోవడమేనని వ్యాఖ్యానించారు. పురపాలకశాఖపై అవినీతి మచ్చపోవాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఎస్​బీపాస్‌ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని.. లేకుంటే పదవుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

'పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది మిగతా శాఖల కంటే ఎక్కువ గొడ్డు చాకిరీ చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలకు అదనపు సిబ్బంది లేకున్నా బాగా పనిచేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని అభినందించాలి. కౌన్సిల్ సమావేశాల్లో అధికారులపై అరవడం గొప్ప అని కొందరు అనుకుంటారు. మన అధికారులను అవమానిస్తే మనల్ని, మన ప్రభుత్వాలను అవమానించుకోవడమే. కౌన్సిల్ సమావేశాల్లోకి మీడియాను అనుమతించకుండా సమావేశం అనంతరం వివరాలు ఇవ్వాలి.' -కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

ఇవీ చదవండి:పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం సమీక్ష

'శాస్త్ర, సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యం'

Last Updated : May 13, 2022, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details