పురపాలిక ఎన్నికల కోసం తెరాస ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తోంది. పోలింగ్ బూత్ల వారీగా కమిటీలు, వార్డుల, డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తెరాస సభ్యత్వ నమోదు శనివారంతో పూర్తి కావడం వల్ల పురపాలక ఎన్నికలపై దృష్టి సారించింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభ్యత్వ నమోదు, పురపాలక ఎన్నికలపై పార్టీ నేతలతో నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
బూత్ కమిటీలు
మున్సిపల్ ఎన్నికలను తెరాస అత్యంత కీలకంగా భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని యోచిస్తోంది. నగరాల్లో విజయం సాధించి పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. ఆ దిశగా బూత్ కమిటీలు ఏర్పాటు చేయబోతుంది. బూత్ కమిటీలతో సానుకూల ఫలితాలు వస్తాయని తెరాస అధిష్ఠానం బలంగా నమ్ముతోంది. ఇంటింటి ప్రచారం.. ఓటర్ల సమీకరణ ద్వారా శాసనసభ, స్థానిక ఎన్నికల్లో ఘన విజయాలకు కమిటీలు కీలకంగా వ్యహరించాయని భావిస్తోంది.