ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాధాన్యం, అవసరం మరింతగా పెరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్, ఫార్మాలో తనదైన స్థానాన్ని నిలబెట్టుకొందన్న మంత్రి... భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని ఫార్మా సిటీ అంతర్జాతీయ పటంలో ప్రత్యేకంగా నిలుపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి కరోనాకి అవసరమైన మందుతో పాటు వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రణాళికలు వేగంగా రూపొందుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఫార్మాసిటీ ద్వారా ఇలాంటి అనేక సమస్యలకు, వ్యాధులకు ఇక్కడి నుంచి సమాధానం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ ఫార్మాసిటీ పనుల పురోగతిపై సమీక్షించారు.
అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్
అమెరికాకు చెందిన యూఎస్ఎఫ్డీఏ నుంచి వరుసగా అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందన్న కేటీఆర్... ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా నిలవబోతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ... జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఉండబోతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మాసిటీని రూపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... తమ శాఖ పని చేస్తుందని మంత్రి తెలిపారు.