KTR On SNDP Project in Hyderabad :హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం నిర్మించిన 10 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి.. మూసీ నదిపైనా కబ్జాలను తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్(Minister KTR) వెల్లడించారు. అత్యంత పేదరికం వల్ల మూసీనది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని మంత్రి తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపైన చర్చించారు. జంటనగరాల అభివృద్ధికై చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ కార్యక్రమాల ప్రస్తుత, భవిష్యత్ కార్యకలాపాలపై చర్చించారు.
నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలందరూ.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కుధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు.. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.