భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా 87 మున్సిపాల్టీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామని, వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందన్నారు. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
ప్రత్యేక కార్యాచరణ
సుమారు 1100 దరఖాస్తులు వచ్చాయని, సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థకు సంబంధించి పక్షం రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. మిగతా మున్సిపాల్టీలతోపాటు జీహెచ్ఎంసీలోనూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని గ్రేటర్ అధికారులకు మంత్రి ప్రత్యేకంగా తెలిపారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.