భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా రోడ్ల విస్తరణ, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.
రోడ్ల నిర్మాణం, విస్తరణ
రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించాలన్నారు. ఒక్కో జోన్‌పై ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో చేయాల్సిన రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలన్నింటిపై ఒక నివేదిక అందించాలని తెలిపారు. నివేదికలో ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో.. రోడ్లపైన ఏర్పడే జంక్షన్ల అభివృద్ధి, బస్‌బేలు, టాయిలెట్ల నిర్మాణం వంటి అంశాలకు సంబంధించి సమాచారం ఉండాలన్నారు. నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్లు, సంస్థతో కలిసి పని చేసి నెలరోజుల్లోగా ఓ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.
మీడియన్ గ్రీనరీ ఉండేలా
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద ఫీట్ల రోడ్డుపైన కచ్చితంగా ఒక మీడియన్ గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ లోకేశ్ కుమార్‌కు కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్, రేడియల్, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.