'మలేషియాలో రాష్ట్రవాసులను స్వస్థలాలకు తీసుకొస్తాం' మలేషియాలో వీసా గడువు ముగిసిన తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరేలా చొరవ తీసుకుంటానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు 2 వేల మంది రాష్ట్రవాసులు అక్కడ చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారని... తెరాస ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
డిసెంబరు 31 గడువు
వీసా లేకుండా నివసిస్తున్న భారతీయులు డిసెంబరు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే జరిమానా కట్టడం సహా భారత్ వెళ్లేందుకు విమాన టికెట్ చూపించాలని షరతు విధించింది. దీనికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుందని తెరాస ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కేటీఆర్ దృష్టికి తెచ్చి... ప్రభుత్వం తరఫున తగిన సహాయం చేయాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. గతేడాది దుబాయ్ నుంచి సుమారు 600 మందిని ప్రభుత్వం సురక్షితంగా తీసుకువచ్చిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇదీ చూడండి : రైతుల పొలాలు పచ్చగా.. కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రగా..