తెలంగాణ

telangana

ETV Bharat / state

Kid Complaint to Ktr: క్యూట్ బట్ సీరియస్... పిల్లాడి ఫిర్యాదుపై స్పందించిన కేటీఆర్ - Telangana news

Kid Complaint to Ktr: పట్టుమని పదేళ్లు కూడా ఉండవు ఆ పిల్లాడికి. కానీ ఏకంగా మంత్రినే కదిలించాడు. తమ కాలనీ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా... చిన్నారి వదల్లేదు. తాను అనుకున్నట్లుగానే సమస్యను మంత్రికి చేరవేశాడు. అందరి మన్ననలను పొందుతున్నాడు.

Ktr
Ktr

By

Published : Jan 30, 2022, 4:14 PM IST

Kid Complaint to Ktr: తమ కాలనీ సమస్యపై 7 ఏళ్ల కుర్రాడు కార్తికేయ రాసిన లేఖపై పురపాలక, ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్‌తో పాటు చుట్టుపక్కల కాలనీలో కాలిబాట నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది ఆరు నెలల క్రితం పనులు చేపట్టి మధ్యలో ఆపేశారు. దానివల్ల కాలిబాట కోసం తవ్విన గుంతలు కాలనీవాసులకు సమస్యగా మారాయి. కాగా... చిన్నారి కార్తికేయ సైతం ఈ రాళ్లు తట్టుకొని పలుమార్లు కింద పడ్డాడు. ఆ బాధతో చాలా రోజులుగా మంత్రి కేటీఆర్‌కు లేఖ రాస్తానని ఇంట్లో అడుగుతున్నప్పటికీ... తల్లిదండ్రులు సర్ది చెప్పారు.

చిన్నారి లేఖ

ఇలా కాదులే అనుకున్న కార్తికేయ... తాను రాసిన లేఖను మామయ్య ద్వారా శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కి చేరవేశాడు. చిన్నారి రాసిన లేఖపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. వెంటనే సికింద్రాబాద్ జోనల్ అధికారులు... క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. అధికారులు హుటాహుటిన చిన్నారి ఇంటికి చేరుకొని విషయాన్ని ఆరా తీయగా సమస్య వాస్తవమని తేలింది. మధ్యలో ఆగిన పనులను వెంటనే పూర్తి చేస్తామని అధికారులు కార్తికేయకు హామీ ఇచ్చారు.

స్పందించిన కేటీఆర్

మా ఇంటి ముందు ఫుట్‌పాత్ తవ్వారు. అలాగే వదిలిస్తే... నేను సైకిల్ తొక్కుతూ కిందపడిపోయిన. అందుకని లెటర్‌ రాసిన. ప్లీజ్‌ సాల్వ్ ది ప్రాబ్లమ్ అని కేటీఆర్‌కు రాసిన.

-- చిన్నారి కార్తికేయ

కాలనీ సమస్యలపై సామాజిక అంశాలను కార్తికేయ... ముద్దు ముద్దు మాటలతో ప్రస్తావించడంపై అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. తన కళ్లతో చూసిన పరిస్థితులను అక్షరాల్లో పెట్టడం... సామాజిక సమస్యలపై మాట్లాడడం కార్తికేయకు అలవాటుగా మారిందని గతంలోనూ పలు లేఖలు రాశాడని తల్లిదండ్రులు తెలిపారు.

సమస్యలతో కలిసి జీవించడానికి దాదాపుగా అలవాటుపడిపోయాం. ఈ తరం పిల్లల్ని చూస్తే వాళ్లు సమస్యలపై ప్రశ్నించడానికి వెనకాడట్లేదు. వాళ్ల ఆలోచనలను, ప్రశ్నించే తత్వాన్ని అడ్డుకోకుండా ఉంటే మనం వాళ్లని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దుకోవచ్చు.

-- కార్తికేయ కుటుంబ సభ్యులు

క్యూట్ బట్ సీరియస్... పిల్లాడి ఫిర్యాదుపై స్పందించిన కేటీఆర్

ఇదీ చూడండి:

Ktr on NDA Govt: '2022లోగా నెరవేరుస్తామన్న హామీలు గుర్తు చేస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details