KTR on Telangana Policing System : రాష్ట్ర అభివృద్ధిలో భద్రత కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే విషయం సీఎం కేసీఆర్ సైతం విశ్వసిస్తారని వ్యాఖ్యానించారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ పోలీస్ వ్యవస్థకు అభినందనలు తెలుపుతూ మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టి.. ప్రజలకు భరోసా కల్పిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులు, సంబంధిత శాఖల్లో పని చేసే ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంతతకు చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను వినియోగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
- Telangana Police Department : ప్రత్యేక రాష్ట్రంలో పోలీస్ శాఖకు పెద్దపీట.. అప్పటి కంటే ఎక్కువగా..!
- Suraksha Day in Decade Celebrations : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం
పోలీస్ నియామకాలను భారీగా పెంచటంతో పాటు ఆధునిక వాహనాలతో పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టపరిచామన్నారు. కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాలతో పోలీస్ వ్యవస్థ ముఖచిత్రమే మారిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్ వంటివి తీసుకొచ్చి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో సీసీ టీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయటంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీటీవీల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు. దీని ద్వారా నేరాల నియంత్రణకు విశేష కృషి చేస్తున్నామని తెలిపారు.