KTR on Investment Roundtable Meeting in London : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానమని మంత్రి కేటీఅర్ పేర్కొన్నారు. లండన్‌లోని భారత హై కమిషనర్ విక్రం కె.దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు, తదితరులకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాల గురించి కేటీఆర్ వివరించారు.
రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు : ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించామని కేటీఆర్ చెప్పారు. అందుకనుగుణంగా వాటి పరిష్కారానికి ప్రయత్నించామని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి అంశాలపైన 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్.. ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్ వంటి రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్ ఈకో సిస్టం.. పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల వలన ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలంగాణ ఇన్వ్‌స్ట్‌మెంట్ ప్రమోషన్ ఎన్నారై అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం : అంతకుముందు రాబోయే సంవత్సర కాలంలో 1000 మందికి ఉపాధి కల్పించేలా.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎంఓయూపై ఐటీ, పరిశ్రమల శాఖల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ సీఈఓ ఆంథోనీ మెక్‌కార్తీ సంతకాలు చేశారు.