Telangana Assembly Sessions 2023 : రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్టేబుల్ గవర్న్‌మెంట్, ఏబుల్ లీడర్‌షిప్ వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. హైదరాబాద్‌లో 1987లో మొట్టమొదట ఐటీ పరిశ్రమ వచ్చిందని.. బేగంపేటలో కట్టిన ఇంటర్‌గ్రాఫ్.. మొట్టమొదటి ఐటీ భవనమని వివరించారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి, ఎగుమతులు, ఉపాధి అవకాశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, నోముల భగత్, బీగాల గణేశ్, అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
KTR on Telangana IT Exports 2023 : ఈ సందర్భంగా 1987 నుంచి 2014 వరకు మన ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఒక్క గతేడాదే ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లని స్పష్టం చేశారు. ఐటీలో 27 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించామని మంత్రి వివరించారు. ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తోందన్న కేటీఆర్.. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవేనని హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలన్న ఆయన.. ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలు తట్టుకుని నిలబడాలన్నారు.
రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్లే ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. గురుగ్రామ్‌లో ఐటీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో 1987లో మొట్టమొదట ఐటీ పరిశ్రమ వచ్చింది. బేగంపేటలో కట్టిన ఇంటర్‌గ్రాఫ్.. మొట్టమొదటి ఐటీ భవనం. 1987 నుంచి 2014 వరకు మన ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు. ఒక్క గతేడాదే మన ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు. ఐటీలో 27 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం. ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవే. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలి. ప్రతి చోటా అంతర్జాతీయ ప్రమాణాలు తట్టుకుని నిలబడాలి. - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
KTR on Telangana IT Sector Development :2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని.. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో భూముల రేట్లూ బాగా పెరుగుతున్నాయన్న కేటీఆర్.. కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్ధలుకొట్టిందని గుర్తు చేశారు.