KTR on Telangana Deeksha Divas 2023 :రాష్ట్ర స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం.. దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతం అవ్వాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు. తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని చెప్పారు. నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని తెలిపారు. దేశాభివృద్ధికి.. తెలంగాణను ఒక మోడల్‌గా నిలిపేందుకు ఆ రోజు బీజం పడిందని అన్నారు. నవంబరు 29న దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి చరిత్రను గుర్తు చేస్తూ.. కేటీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
దిల్లీ పీఠం దిగి వచ్చేందుకు ఈ రోజే నాందీ వాచకం :తెలంగాణ అజరామర చరిత్రకు.. వీరోచిత సంతకం దీక్షా దివస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 తన జీవితంలో మరచిపోలేనని చెప్పారు. దశాబ్దాలుగా దగాపడ్డ.. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచేందుకు.. కేసీఆర్ నడుం బిగించిన రోజు ఇదని అన్నారు. రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడోనని నినదిస్తూ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగి.. దిల్లీ పీఠం దిగి వచ్చేందుకు ఈ రోజే నాందీ వాచకం పలికారని కేటీఆర్ గుర్తు చేశారు.
అధికారంలో వచ్చాక అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తాం : కేటీఆర్
KTR Said Diksha Divas a Memorable day in Telangana history :తెలంగాణ ఇస్తామని 2004లో బీఆర్ఎస్ (టీఆర్‌ఎస్)తో పొత్తుపెట్టుకొని.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress party) రాష్ట్రానికి దోఖా చేసేందుకు సిద్ధపడిందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో, యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని పార్లమెంట్ వేదికగా నమ్మబలికి తాత్సారం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా.. సందర్భం వచ్చిన ప్రతిసారీ హస్తం పార్టీ తెలంగాణను అవమానాలు, అవహేళనలకు గురిచేస్తూనే వచ్చిందని కేటీఆర్ విమర్శించారు.
Telangana Deeksha Divas : "ఈ దశలో అక్టోబర్ 21, 2009న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభలో.. కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం నేనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నా.. ఎట్ల తెలంగాణ రాదో చూస్తాను అని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా.. నవంబర్ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఆయన ఆమరణ నిరాహారదీక్షా వేదిక సిద్ధమైంది. హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి, కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌కు నవంబర్ 28న చేరుకున్నారు. నవంబర్ 29 తెల్లావారేసరికి ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు ఆయనకు.. ఉద్యమ శ్రేణులు రక్షణ కవచంగా నిలిచి పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీసులు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు." అని కేటీఆర్ వెల్లడించారు.