KTR on Telangana Debts 2023 2023: వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. కొంత మంది నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికావని బదులిచ్చారు. హైదరాబాద్లో మీట్ ది ప్రెస్లో కేటీఆర్ మాట్లాడారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని కొనియాడారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు.
KTR on Telangana Loans 2023 : ప్రతి ఏడాది 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 26 వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామని అన్నారు. సంపద సృష్టించడం కోసమే రుణాలు తీసుకువచ్చామని తెలిపారు. అప్పుల మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామని పేర్కొన్నారు. దీనివల్ల ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి రూ.2.41 లక్షల కోట్ల ఎగుమతులు అవుతున్నాయని తెలియజేశారు. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు.
KTR Respond on Medigadda Project : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఐదేళ్లు పూర్తయ్యింది. ప్రజలకు సంబంధించి ఒక్కపైసా వృథా కాదు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం పడదు. ఒక్కపైసా భారం పడకుండా ఏజెన్సీనే పూర్తి చేస్తుంది. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని బ్యారేజ్ నిలబడింది. ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ పరిశీలించింది. కాళేశ్వరం చివరి ఆయక్టటుకు నీళ్లు అందుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికాదు 'అని అన్నారు.
KTR on Jobs in Telangana : దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల ఉపాధి కల్పన జరిగిందని.. హైదరాబాద్ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. దీంతో పాటు 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని గుర్తు చేశారు.