KTR Tweet on Manipur women naked parade Incident : జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది పురుషులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మే 4న జరిగిన ఈ అమానవీయ ఘటన తాజాగా వీడియో వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా వేదికగా అనేక మంది ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళల పట్ల ఇలా వ్యవహరించడం దేశానికి సిగ్గుచేటన్న మోదీ.. నిందితులను వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ఈ ఘటనపై స్పందించారు.
KTR Tweet on Manipur Incident : మన దేశంలోనే.. మణిపుర్‌లో మెయిటీ గుంపు ద్వారా కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలో అనాగరికత ఎలా సాధారణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ భయానక హింసాకాండ.. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మణిపుర్‌లో ప్రతి పరువు మంటగలుస్తోన్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ, హోం మంత్రి అమిత్ షా జీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
''మన దేశంలోనే.. మణిపుర్‌లో మెయిటీ గుంపు ద్వారా కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికం. దేశంలో అనాగరికత ఎలా సాధారణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ బాధాకర ఘటన ఉదాహరణ. ఈ భయానక హింసాకాండ.. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడాన్ని కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోంది. మణిపుర్‌లో ప్రతి పరువు మంటగలుస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ, హోం మంత్రి అమిత్ షా జీ ఎక్కడ ఉన్నారు.'' - కేటీఆర్ ట్వీట్