KTR Launches Stellantis Digital Hub office : ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ సహా అన్ని రంగాల అభివృద్ధితో.. దేశంలోనే తెలంగాణ కాంతిపుంజంలా దూసుకెళ్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒకే రోజు పలు సంస్థల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మానవ వనరులు, నైపుణ్యానికి నగరం రాజధానిగా మారిందని చెప్పారు. నానక్‌రాంగూడాలో స్టెల్లాంటిస్ సంస్థ డిజిటల్ హబ్ కార్యాలాయాన్ని ప్రారంభించిన మంత్రి.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామ్యం కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఆటోమొబైల్ ఇపుడు నాలుగు చక్రాలపై కంప్యూటర్‌గా మారిపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఎంతో నైపుణ్యం ఉందని.. నైపుణ్యాలను ఆకర్షిస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
KTR Inaugurated Right software company : అనంతరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రైట్ సాఫ్ట్వేర్ కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరం మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారిందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి విప్లవంలా సాగుతోందని చెప్పారు. నగరంలో ఉన్న వృద్ధి భారతదేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న రెండు ఉద్యోగాల్లో.. హైదరాబాద్‌లోనే ఒకటి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వివరించారు.
- ఇవీ చదవండి:Telangana Diagnostics Hubs : 'పేదల వైద్య ఖర్చులు తగ్గించడంలో T-డయాగ్నోస్టిక్స్ చొరవ అద్భుతం'
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌ల ఏర్పాటు : నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల్లో.. జీవితంపై కసి ఎక్కువగా ఉంటుందని కేటీఆర్ వివరించారు. వారు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. ఆంగ్లం అంతగా రాకున్నప్పటికి పట్టుదల ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమర్థ ప్రభుత్వం, పటిష్ఠ నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ టీహబ్‌లో ఏర్పాటు చేసిన మోబిస్-బిట్స్ పిలాని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించారు.