KTR talked about the IT hub: ఐటీ, ఐటీ అనుబంధ రంగాలను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు వాస్తవరూపం దాలుస్తున్నాయని ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్‌లు విజయవంతంగా పనిచేస్తున్నాయని, ఇతర ప్రాంతాల్లోని ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు దాదాపు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత సిద్దిపేట ఐటీ హబ్ ప్రారంభమవుతుందని, నల్గొండ ఐటీ హబ్ నిర్మాణం కూడా మరో నాలుగైదు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ఐటీ హబ్‌ల పూర్తి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.
ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు జిల్లా కేంద్రాలకు విస్తరించడం ద్వారా డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అన్న త్రీడీ మంత్ర నెరవేరుతుందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో మెట్రో నగరాలతో పోలిస్తే గ్రామీణ యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత మేరకు ఐటీ రంగాన్ని రాష్ట్రం నలుమూలలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఐటీ హబ్‌గా మారిన వరంగల్ ఫలితాలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు.