KTR Fires on Congress and BJP : అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అందరూ కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులను బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. టికెట్ కోసం ఆలోచనలు, ఆశలు ఉండొచ్చు కానీ.. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు పార్టీ నిర్ణయించిన వారిని గెలిపించుకోవాలన్నారు. అనేక ఆలోచనలు, వడబోతల తర్వాత అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్(KTR) అన్నారు.
ఒకటే సీటు.. ఒకే బీఫాం ఉంటుందని.. వ్యక్తిగత కోరికలు, అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని కేటీఆర్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ గుప్తా, ఎంపీపీ అధ్యక్షురాలు నిర్మల తదితరులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. వారికి మంత్రి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
KTR Fires on Congress Party : ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14కు.. 14 సీట్లనూ గెలవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ను నమ్మితే వందేళ్లు వెనక్కి వెళతామని.. మళ్లీ అంధకారం వస్తుందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఇవ్వని కాంగ్రెస్.. ఇప్పుడు రూ.4000 ఇస్తుందా అని ఎద్దేవా చేశారు. సంపద పెంచి..పేదలకు పంచాలనేది తమ విధానమైతే.. కుంభోకోణాల మేళాలు మొదలు పెట్టాలనేది కాంగ్రెస్ ఆలోచనని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన సంచలన నాయకుడు కేసీఆర్ ఒకవైపైతే.. డబ్బుల సంచులతో దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరొకవైపని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీకి నలభై మంది అభ్యర్థులు కూడా లేరని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేసీఆర్(KCR) వంటి నాయకుడే శ్రీరామరక్ష అని.. దిల్లీ పార్టీలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని ఈదినట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటంలో గట్టిగా నిలబడాలని.. ఆగం కావద్దని కేటీఆర్ సూచించారు. ఒక పార్టీది కుల పిచ్చి.. మరొకరిది మత పిచ్చి అని ధ్వజమెత్తారు.