KTR on Bandi Sanjay speech in Lok Sabha :పార్లమెంట్ లోక్‌సభ సమావేశాలు(Parliament Monsoon Sessions 2023) వాడీవేడిగా సాగుతున్న వేళ గురువారం రోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్‌పై ఆయన మాట్లాడిన సమయంలో.. తెలంగాణసీఎం కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ శ్రేణులు ఖండిస్తున్నాయి. రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడిపై.. బండి సంజయ్ అలా మాట్లాడటం తగదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ ట్విటర్(KTR Twitter) వేదికగా స్పందించారు.
KTR Fires on Bandi Sanjay over Lok Sabha Speech :గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానకరంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. గురువారం రోజున పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్ గురించి.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. మరి ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై తాము ఏలాంటి చర్యలకు సిద్ధపడాలని అడిగారు.
BRS MLC Kavitha Fires on Bandi Sanjay : మరోవైపు ఉచిత విద్యుత్‌పై బండి సంజయ్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బండి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కూడా మండిపడ్డారు. బండి సంజయ్(Bandi Sanjay), ధర్మపురి అర్వింద్ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో ప్రస్తావించిన బండి సంజయ్.. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొనిచూడాలని.. అప్పుడు కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెల్లదీస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(Kavitha Kalvakuntla) విమర్శించారు.