KTR Meeting with Maharashtra Representatives of Real Estate : తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి నగరానికి విచ్చేసిన మహారాష్ట్ర ప్రతినిధులకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం ప్రగతిపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని ప్రస్తావించారు. మహారాష్ట్రలో అనేక జిల్లాలు చారిత్రాత్మకంగా రాష్ట్రంతో అనుబంధం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని వివరించారు. అందుకే తెలంగాణ-మహారాష్ట్ర మధ్య సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నాయని గుర్తు చేశారు.
KTR Powerpoint Presentation on Telangana Development : రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అనుమానాలు పటాపంచలు చేస్తూ 10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఎంత ఎక్కువ నిధులు మౌలిక వసతుల కల్పనపై వెచ్చిస్తే అంత వేగంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని.. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేసిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ రంగం(Life Sciences Biotechnology Field)లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనను చేపట్టామని వెల్లడించారు. భాగ్యనగరం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బెంగళూరు నగరాన్ని ఐటీ ఉద్యోగాల కల్పనలో వరుసగా రెండు సంవత్సరాలు దాటివేసిందని కీర్తించారు.
Telangana First Place in Grain production: ఐటీ ఎగుమతులతో పాటు ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించిందని, అందుకే దేశంలో ఎక్కడా లేనిరీతిలో విప్లవాత్మక టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్బీ పాస్ ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికే తెలంగాణ విధానాలు, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయని తెలిపారు. నగరంలో భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టి భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. నగరంలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైల్(Metro Rail) వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జి లాంటి నిర్మాణాలను పూర్తి చేశారని చెప్పారు.