KTR letter to Piyush Goyal: దేశంలో వైద్య పరికరాలపై 12 శాతం, డయాగ్నోస్టిక్స్ పరికరాలపై 18 శాతం విధిస్తున్న జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ చేశారు. తెలంగాణ సహా భారత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంగళవారం రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
KTR letter to Piyush Goyal about GST on Medical Equipment : వైద్య పరికరాలు విలాసవంతమైన వస్తువులు కావనీ, అందరికీ ఆరోగ్యం అందాలంటే వాటితోపాటు డయాగ్నోస్టిక్స్ కీలకమని గుర్తించాలన్నారు. ఈ ఏడాది గత నెల ఫిబ్రవరిలో బయో ఏసియా 20వ వార్షికోత్సవ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించిన సందర్భంగా.. వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇందులో వారు తమ ఎదురవుతున్న సమస్యలను, వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడే చర్యలను సూచించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం కస్టమ్ డ్యూటీతో పాటు వైద్య పరికరాల విడిభాగాలపై కూడా జీఎస్‌టీని ఎక్కువ రేటుతో వసూలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఫలితంగా భారత్‌లో వైద్య ఉపకరణాల ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించారు. పైగా ఆరోగ్యరంగంలో జీఎస్‌టీపై తిరిగి చెల్లించే విధానం అమల్లో లేనందను ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది అడ్డంకిగా మారుతోందని లేఖలో పేర్కొన్నారు.