తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్​ 27న బీఆర్​ఎస్​ ఆవిర్భావ వేడుకలు.. - అక్టోబర్​10న వరంగల్​లో బీఆర్​ఎస్​ బహిరంగ సభ

BRS Foundation Day Programs: రాష్ట్రంలో విస్తృతంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు.. అక్టోబరు 10వ తేదీన వరంగల్‌లో బీఆర్​ఎస్​ భారీ మహాసభ జరగనుంది.

ktr
ktr

By

Published : Apr 9, 2023, 5:03 PM IST

BRS Foundation Day Programs: పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని కేటీఆర్​ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని.. ఈ సమావేశాలు పార్టీ నియమించిన ఇంఛార్జ్​లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలు ఎగరవేయాలని కేటీఆర్​ సూచించారు. ఈ కార్యక్రమం ముగించుకుని ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులకు వివరించారు. 25వ తేదీన ఆ రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని.. ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 నుంచి 3000 మంది ప్రతినిధులతో నిర్వహించాలని కేసీఆర్‌ సూచించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

ఏప్రిల్​ 27న బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం: ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌ని కేంద్ర కార్యాలయంలో.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. అదేరోజు తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందన్న కేటీఆర్‌.. ఆ సమావేశంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున వరికోతలుండడం, ఎండతీవ్రత పెరుగుతున్నందున పార్టీ ఆవిర్భావం రోజు నిర్వహించే భారీ సభ, విస్తృత స్థాయి సమావేశాన్ని.. అక్టోబర్ 10న వరంగల్‌లో నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జరపుతున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్ని మే వరకు కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంఛార్జ్​గా మర్రి రాజశేఖర్‌రెడ్డి, గోషామహల్‌కి ఇంఛార్జ్​గా నందకిషోర్ వ్యాస్‌బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్​గా ఎంపీ మాలోతు కవితను నియమిస్తూ కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details