రాష్ట్రంలో ఫిబ్రవరి 15న జరగనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు తెరాస కసరత్తు ప్రారంభించింది. పురపాలక ఎన్నికల మాదిరి.. సహకార ఎన్నికల బాధ్యతను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్... కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులను తెరాస అధిష్ఠానం అప్రమత్తం చేసింది. సహకార ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అయినా పార్టీకి చెందిన వారిని డైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా ఎన్నుకోవడానికి కృషి చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికలకు కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాల్లో 18.42 లక్షల మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అనంతరం రైతు సమన్వయ సమితి ద్వారా గిట్టుబాటు ధరలు, పంటల సాగు కాలనీల ఏర్పాటు వంటి వాటిపై ముందుకెళ్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి సహకార వ్యవస్థ మద్దతు అవసరమని ఆయన భావిస్తున్నారు.