KTR Fires On Central Government : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాల్ని తీర్చేలా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలి కూడలిలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌ను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు. ఐటీ కారిడార్, ఓఆర్‌ఆర్‌ను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ల అనుసంధానం పెరగనుంది. ఐకియా మాల్ వెనుక మొదలై.. ఓఆర్‌ఆర్‌పైకి ఫ్లై ఓవర్ చేరుతుంది.
956 పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో 250 కోట్ల రూపాయలతో ఈ పైవంతెనను నిర్మించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 48 కార్యక్రమాలు చేపడితే.. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌తో కలిపి 33 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది వచ్చి స్థిరపడుతున్నారన్న ఆయన.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఆర్ఎంపీ ద్వారా నగరంలో రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మెట్రో రెండో దశను కేంద్రం సహకరించకపోయినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఇతర ఫ్లై ఓవర్‌లను వేగవంతంగా పూర్తి చేస్తామని.. కొత్తగా వచ్చే ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.