KTR Inaugurated GHMC Ward Office in Kachiguda : పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... వార్డు పాలన ద్వారా జరిగే అభివృద్ధిపై పలు సూచనలు చేశారు.
KTR Comments on Ward Governance in Hyderabad : పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది, దోమల సమస్యకు ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అలాగే మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయానికి వార్డు శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ తరఫున వార్డు లైన్‌మెన్, ఓ కంప్యూటర్ ఆపరేటర్.... ఇలా మొత్తం 10 మంది అధికారులు ఒక్కో వార్డు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సులభమైన సేవలను అందిస్తారని వెల్లడించారు.