KTR Fires on PM Modi Statements in BC Public Meeting : 'తెలంగాణలో 'బీసీని ముఖ్యమంత్రి చేస్తాం''.. రాష్ట్ర ఓటర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన మాట ఇది. కేంద్రంలోని బీజేపీలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న నేతగా చెప్పుకొనే అమిత్ షా నోటి నుంచి వచ్చిన ఈ మాట తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా మాట్లాడుతుంటే.. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మాత్రం బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన బీసీ ఆత్మీయ సభలో మరోసారి బీసీ సీఎం నినాదాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించడంతో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు.
'రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీకి బీ టీమ్ అంటారు.. ప్రధానమంత్రి మోదీ వచ్చి.. తాము కాంగ్రెస్‌కు సీ టీమ్ అంటారు.. మేము బీజేపీకి బీ టీమ్ కాదు, కాంగ్రెస్‌కు సీ టీమ్ కాదు' అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమది ముమ్మాటికీ టీ టీమ్.. తెలంగాణ టీమ్ అని ఎక్స్(ట్విటర్)లో వివరించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ పార్టీదే అని తెలిపారు. నిన్నటి దాకా మత రాజకీయం చేశారని.. ఇక ఇప్పుడు కుల రాజకీయానికి తెర తీశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
KTR Tweet on PM Modi Speech :పదేళ్ల బీజేపీ హయాంలో దేశంలోని బీసీలకు మిగిలింది వేదన మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. బీసీల జనగణన కూడా చేయని పాలన బీజేపీది అని.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం అంటూ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయేనని ఆయన అన్నారు. బీసీలంటే ఆ పార్టీ దృష్టిలో బలహీనవర్గాలు.. కానీ, తమకు బీసీలంటే బలమైన వర్గాలని ప్రధానిమంత్రికి తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన సర్కార్ బీఆర్ఎస్ది అని వివరించారు.