KTR Fires on Congress 2023 :రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారని మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు. టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నాయకులే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఇప్పటికే పట్టుబడ్డారని గుర్తు చేశారు. అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారని.. ఇలాంటివారు హస్తం పార్టీలో ఉంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో? అని ఎక్స్ ( ట్విటర్) వేదికగా కేటీఆర్ విమర్శించారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.
BRS Leaders Comments on Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై.. బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అనగానే దిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులని.. మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంపై ఆయన అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారని ఆరోపించారు. రాహుల్ లీడర్ కాదని.. జస్ట్ రీడర్ అని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని.. ఏ హోదాతో రాహుల్ గాంధీ చెబుతున్నారని హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనా? రాహులా? ప్రియాంకనా? అని అడిగారు. బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీం అని.. రాహుల్ చెప్పడంపైనా ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ నాణానికి బొమ్మాబొరుసని ఆరోపించారు. రెండుపార్టీలు తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి ఎవరికీ బీ టీమ్ కాదని.. ప్రజలకు ఏ టీమ్ అని పేర్కొన్నారు. ప్రజలే హైకమాండ్ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.