KTR Fires on Congress 6 Guarantees in Telangana :తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ బహిరంగ సభలో.. ఆరు గ్యారెంటీ హమీలను (Congress Six Guarantees) సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ట్విటర్ వేదికగా మంత్రి హరీశ్ రావు.. హస్తం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వర్ణిస్తూ.. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ట్వీట్ (KTR Tweet ) చేశారు.
KTR Tweet on Congress 6 Guarantees : కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా.. మోసం, వంచన, ద్రోహం, దాఖలమయం అని కేటీఆర్ అభివర్ణించారు. కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన గడ్డ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. కల్లబొల్లి గ్యారెంటీలు రాష్ట్రంలో చెల్లవని పేర్కొన్నారు. రాబందుల రాజ్యమొస్తే రైతు బంధు రద్దవుతుందని తెలిపారు. కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు, కటిక చీకట్లు వస్తాయని చెప్పారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంట్ గతేనని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ఊడగొడతారని కేటీఆర్ వివరించారు.
KTR on Congress Six Guarantees :దగాకోరుల పాలన వస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోతుందని.. బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా.. ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అని కేటీఆర్ వెల్లడించారు. సమర్థత లేని వారికి ఓటేస్తే.. సకల రంగాల్లో సంక్షోభమేనని తెలిపారు. దిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెడతారని పేర్కొన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపదనంతా స్వాహా చేస్తారని.. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం ఖాయమని కేటీఆర్ అన్నారు.