కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఛార్జిషీట్లు వేశామంటున్నారని.. మేం వేయాల్సి వస్తే 132 కోట్లు ఛార్జిషీట్లు వేయాల్సి వస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీరో అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ... ఎంతమందికి వేశారని ప్రశ్నించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జహీరానగర్ రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని కేంద్రాన్ని నిలదీశారు. విశ్వనగరం మన నినాదమైతే విద్వేష నగరం భాజపా నినాదంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు కైవసం చేసుకున్నామని.. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదంతో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.
భాజపా, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో, వరద సమయంలో హైదరాబాద్‌లో తిరిగింది ఎవరని నిలదీశారు. రూ.10 వేలు ఇస్తుంటే అడ్డుపడి.. ఇప్పుడు రూ.25 వేలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ఆరున్నర లక్షల మంది లబ్ధిదారుల జాబితా ఇస్తాం.. వాళ్లకు రూ.25 వేలు ఇప్పించండని భాజపా నేతలకు సవాల్ విసిరారు. డిసెంబరు 4 తర్వాత అర్హులైన అందరికీ వరదసాయం అందుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.