KTR Tweet On BJP :ట్విటర్లో ఎల్లప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడు బీజేపీ సర్కార్కు.. ప్రతిపక్ష నేతలకు చురకలంటిస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ ప్రభుత్వంపై.. కేంద్ర మంత్రుల తీరుపై.. బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి కేటీఆర్ ట్విటర్వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
KTR Latest Comments On BJP :బీజేపీ నాయకత్వానికి సంస్కారంలేదని.. ఆ పార్టీ నేతల్లో చాలా మంది మూర్ఖులు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేపిస్టులను సత్కరించేవారని.. హంతకులను స్వాగతించేవారని విమర్శించారు. మహాత్మాగాంధీని హేళన చేసేవారు అంటూ దుయ్యబట్టారు. పరీక్షపత్రాలను లీక్ చేసి యువత జీవితాలతో ఆడుకునేవారని మండిపడ్డారు. క్రీడా ఛాంపియన్‌లను అవమానించేవారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ట్విటర్ వేదికగా కేటీఆర్ కేంద్రంపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు స్వాతంత్య్రం తర్వాత అన్ని రంగాల్లో అత్యుత్తమ పని తీరు కనబరిచాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానంతో.. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆక్షేపించారు.
దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద రాజకీయ శిక్ష :జనాభా విషయంలో పాటించిన క్రమశిక్షణ.. దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద రాజకీయ శిక్షగా మారనుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33 శాతం కాగా.. పార్లమెంట్‌లో మాత్రం వాటి ప్రాతినిథ్యం కేవలం 20 శాతానికే పరిమితమైందని అన్నారు. జాతీయ లక్ష్యాల సాధన పేరిట కేంద్రంలోని గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన జనాభా నియంత్రణ అమలును గాలికొదిలేసిన ఉత్తరాది రాష్ట్రాలు.. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆధిపత్యం చెలాయించనున్నాయని కేటీఆర్ వివరించారు.