KTR Fires on BJP about Palivela Issue: ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతిహింస సమాధానం కాదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతికాముకులం కాబట్టి ఓపికగా ఉంటున్నామని తెలిపారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఓ హాస్పిటల్లో భాజపా దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెరాస నాయకులు, కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
ఉప ఎన్నికల వేళ మునుగోడు మండలం పలివెలలో ఈటల నేతృత్వంలో తెరాస నేతలపై దాడులకు తెగబడ్డారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుసుమ జగదీశ్ సహా 12 మంది నాయకులకు గాయాలయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో సానుభూతి కోసం భాజపా చిల్లర రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఓటమి భయంతో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా మొహం చాటేశారన్న కేటీఆర్.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో భాజపా ఆగడాలు దిల్లీ పెద్దల ఆదేశాల మేరకు సాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. భాజపా ఆరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ వెంట హోం మంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు ఉన్నారు.
అసలేం జరిగిందంటే..మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు భాజపా, మరోవైపు తెరాస ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు గన్‌మెన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ములుగు జడ్పీఛైర్మన్ కుసుమ జగదీశ్‌కు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: