KTR Fires on Kishan Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే కేంద్ర మంత్రి, బీజేపీ సంబరాలు చేసుకోవడంలో మర్మమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయట పెట్టుకుంటున్నారని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు కేసు సీబీఐకి అప్పగించగానే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బండారమంతా కెమెరాకు చిక్కినప్పుడే, బీజేపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. మొదట భుజాలు తడుముకుని ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంబంధం లేకపోతే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు పలుమార్లు కోర్టుల్లో ఎందుకు ప్రయత్నం చేశారన్నారు. సీబీఐకి అప్పగిస్తే సంబరమెందుకని కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్.. తమ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా అని అన్నారు.
పంజరంలో చిలుక తాము చెప్పినట్టే పలుకుతుందని చెప్పకనే చెబుతున్నారా అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసు సీబీఐకి వెళ్తే, తమ బారా ఖూన్ మాఫ్ చేసి క్లీన్‌చిట్ ఇవ్వడం పక్కా అని ఇంత బహిరంగంగా మాట్లాడతారా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తీరుకు బీజేపీని సిగ్గు ప్రకటనలే నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే వారని ఇవాళ సీబీఐకి కేసు అప్పగిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే ఆ దర్యాప్తు సంస్థను బీజేపీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించి కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగలని కేటీఆర్ విరుచుకుపడ్డారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు బీజేపీ వ్యవహారం ఉందన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్‌ను బీజేపీ మించిపోయిందని ధ్వజమెత్తారు.