తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోదీ సర్కారు తాను తీసుకున్న గోతిలో తానే పడిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించదన్నారు. ప్రస్తుత కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.
నాలుగేళ్లకు సరిపోయే నిల్వలు ఉన్నాయని గొప్పలు చెప్పారు: నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందన్నారు. ఇప్పటికే గోధుమలు, వాటి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోదీ సర్కార్.. తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందని మండిపడ్డారు.
ఎఫ్‌సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో స్పష్టమైన విధానం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ సర్కార్‌కు దీర్ఘకాలిక ప్రణాళిక కరవైందన్న సంగతి ఈ సంక్షోభంతో తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని భాజపా ప్రభుత్వం కేంద్రంలో ఉండడం ప్రజల దురదృష్టమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాజకీయాలు పక్కనపెట్టి వివక్షలేని నిర్ణయాలు తీసుకోవాలి:తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమంటూ మోదీ సర్కారు కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులు వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.