తెరాస అధ్యక్ష పదవికి ఈ నెల 25న ఎన్నిక జరగనుంది. అదే రోజు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని తెరాస పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 25న హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ జరగనుంది. హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. తెరాస ద్విదశాబ్ధి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు. తెరాస నేతలు, వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ భేటీ అయ్యారు.అనంతరం పార్కింగ్, ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై చర్చించారు.హైటెక్స్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్ విజయలక్ష్మితో కలిసి ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
2019లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా.. 2020, 2021లలో కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించలేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గిందని.. టీకాల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని ఆయన వెల్లడించారు. హైటెక్స్‌లో నిర్వహణ కోసం ఈనెల 17న పార్టీ అసెంబ్లీ, పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహిస్తారని ఆయన ప్రకటించారు.
పాసులు ఉంటేనే..
ప్లీనరీ సమావేశం కోసం ప్రజాప్రతినిధులకు పాసులు మంజూరు చేస్తామని.. పాసులు ఉన్నవారినే అనుమతిస్తారని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని చూసి సరిహద్దులోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలిసేందుకు ముందుకొస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం తెలంగాణను స్ఫూర్తి పొందే స్థాయికి రాష్ట్రం చేరుకుందన్నారు. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను చూసి కేంద్రం కూడా స్ఫూర్తి పొందిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును చూసి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మిషన్ భగీరథను చూసి కేంద్రం జల్ జీవన్‌ను తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఎస్ ఐపాస్ నుంచి స్ఫూర్తి పొంది 'ఇన్వెస్ట్ ఇండియా'ను తీసుకొచ్చారన్నారు. ఈ 20 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్టీ ద్విదశాబ్ధి వేడుకతో పాటు, తెరాస అధ్యక్ష ఎన్నిక.. ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలను తెరాస ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.