KTR At Davos :దేశంలో ఉన్న వాళ్లతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తన బృందంతో కలిసి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లారు. అక్కడి ప్రవాస భారతీయులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్ నుంచి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు.
KTR Davos tour : ‘‘మానవ జీవితం పరిమిత కాలమనే సిద్ధాంతాన్ని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వలన కొంత ప్రచారం లభిస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్నాయి. అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం ప్రవాస భారతీయులు నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన స్థానిక తెలుగువారికి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.