తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Comments: 'అభివృద్ధిలో దూసుకుపోతున్నా కేంద్రం నుంచి చేయూత కరవు' - తెలంగాణ వార్తలు

పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఎంత దూసుకుపోతున్నా.. కేంద్రం నుంచి చేయూత కరవవుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR Comments) ఆక్షేపించారు. కేంద్ర పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ ఐటీసీ కాకతీయలో జరిగిన సీఐఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

KTR Comments, ktr about central government
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు, కేంద్రంపై కేటీఆర్ విమర్శలు

By

Published : Nov 8, 2021, 7:54 PM IST

అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు మరింత చేయూతనందించి దన్నుగా నిలవాల్సిన కేంద్రం... పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని మంత్రి కేటీఆర్(KTR Comments) ఆరోపించారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో సీఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅథిగా కేటీఆర్ హాజరయ్యారు. బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ ఎక్స్ పోర్ట్ కేటగిరీ వంటి పలు విభాగాల్లో అవార్డులను మంత్రి అందజేశారు. బెస్ట్ ఇన్నోవేషన్-గోల్డ్ కేటగిరీలో భారత్ బయెటెక్ 2021 సంవత్సరానికిగాను ఇండస్ట్రీస్ అవార్డును సొంతం చేసుకోగా.. ఈ అవార్డును ఆ కంపెనీ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా అందుకున్నారు.

కేటీఆర్ కామెంట్స్

ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవార్డులు అందజేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రం దేశ జీడీపీ, ఎకానమికీ కీలక భాగస్వామిగా ఉన్నా.. రాష్ట్రానికి తిరిగి ఇచ్చేందుకు కేంద్రానికి మనసు రావట్లేదని కేటీఆర్ ఆక్షేపించారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీ నిధులను అందించే వరకు కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బుల్లెట్ ట్రైన్, ఇతర ఏ అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ రాష్ట్రాన్ని కేంద్రం భాగస్వామ్యం చేయట్లేదని.. యూపీ, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాలకు ఈ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

'పనితీరు చక్కగా ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహం ఉండాలి. మేము ఎన్నో పథకాలు తీసుకొచ్చి..కేంద్రానికి ఎన్నో వినతులు చేశాం. ఇండస్ట్రియల్‌ కారిడార్లపై ఏడున్నర ఏళ్లుగా ఏ ఒక్క వినతినీ పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ.. ఇంతవరకూ నెరవేర్చలేదు. మెగా ఇండస్ట్రియల్‌ పార్కులు ప్రారంభిస్తామంటే చేయూత లేదు. ఐటీఐఆర్‌ను చెత్తబుట్టలో వేశారు. ప్రత్యామ్నాయ ఆలోచనలూ లేవు.'

-కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి

'ఐఐఎం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ, వైద్య కళాశాలలు, గిరిజన యూనివర్శిటీ వంటి వాటిపై ఎన్ని వినతులు చేసినా సాకారం కావడం లేదు. బుల్లెట్‌ రైలు వచ్చినా దిల్లీ నుంచి ముంబయి వయా గుజరాత్‌ వెళ్తాయి. అంతేగానీ హైదరాబాద్‌ గానీ దక్షిణానాదిన ఏ నగరం గానీ దారి దొరకట్లేదు. మేం కట్టిన పన్నులతో యూపీ, గుజరాత్‌, బిహార్‌లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. తెలంగాణ, ఏపీలకు కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి పునశ్చరించుకుని నెరవేర్చాలి.

-కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి

ఇదీ చదవండి:Liquor stores in telangana: డిసెంబర్‌ నుంచి అమలులోకి నూతన మద్యం విధానం

ABOUT THE AUTHOR

...view details