KTR Tweet Today : కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ పనితీరుపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. భాజపా పాలనలో ఆక్సిజన్ నుంచి బొగ్గు వరకు అన్ని కొరతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కొరత వల్ల పలు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల్లో కూడా కొరతేనని కేటీఆర్ విమర్శించారు. పీఎం మోదీకి ఉన్న విజన్ కొరతే ఈ సమస్యలన్నింటీకి మూలమని ఆయన ట్వీట్ చేశారు.
కొనసాగుతున్న కేటీఆర్ ట్వీట్ వార్ : కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వార్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగిస్తోందని మరోసారి రుజువైందని ఇటీవల కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం.. యథావిధిగా గుజరాత్‌కు తరలిపోయిందని మండిపడ్డారు. సంప్రదాయ వైద్య కేంద్రంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.