KTR on Sanjay Padayatra: బండి సంజయ్ మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని చెప్పారు. ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్... పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా.. నదీ జలాల్లో వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నందుకా... అని ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రసంగాల్లో మత విద్యేషాలు రెచ్చగొట్టడం, అబద్దాలు తప్ప ఇంకేం లేవన్నారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటున్న బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటే మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
కర్ణాటకకు వెళ్లి తెలుసుకోండి:రాష్ట్రంలో పాలనపై విమర్శలు చేస్తున్న బండి సంజయ్.. పక్కనే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక వెళ్లి ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కావాలంటే ఏసీ కార్లు పెట్టి పంపిస్తామని.. అక్కడికి వెళ్లి పాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కర్ణాటకలో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌లో విద్యుత్ కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడ పవర్ హాలిడేలు కూడా ఇస్తుంటే ఎవరి కోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా అని కేటీఆర్ నిలదీశారు. జోగులాంబ, భద్రాద్రి, వేములవాడ.. ఇలా ఏ ఆలయానికైనా నిధులు ఇచ్చారా? అని మండిపడ్డారు. పనికిమాలిన కూతలు మాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.